అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ టెక్ నిపుణులకు మరో ఎదురుదెబ్బ. ప్రముఖ ఐటీ సేవల సంస్థలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్తో పాటు కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ సంస్థలను అమెరికా కార్మిక శాఖ PERM కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఈ కంపెనీల ద్వారా విదేశీ ఉద్యోగుల కోసం కొత్తగా PERM దరఖాస్తులు దాఖలు చేయడం, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడం నిలిచిపోనుంది.
అసలేం జరిగింది?
అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ సోండర్లింగ్ గురువారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ సంస్థలను PERM కార్యక్రమం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా వేర్వేరు సమాఖ్య దర్యాప్తుల నేపథ్యంలో ఈ కార్యక్రమం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
కార్మిక శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. సస్పెండ్ చేసిన సంస్థలకు సంబంధించిన కొత్త PERM దరఖాస్తులను స్వీకరించరు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేయరు.
భారతీయ ఐటీ కంపెనీలే ఎందుకు?
అమెరికాలో విదేశీ నిపుణులను నియమించుకునే సంస్థల్లో భారతీయ ఐటీ కంపెనీలకు పెద్ద స్థానం ఉంది. ఇన్ఫోసిస్, TCS, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ సంస్థలు అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వీటిలో భారతీయ నిపుణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
2026 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన H-1B ఉద్యోగుల విషయంలో TCS రెండో స్థానంలో, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో ఉన్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
PERM అంటే ఏమిటి?
అమెరికాలో ఒక కంపెనీ విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకోవడానికి, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో PERM (Permanent Labor Certification) ముఖ్యమైన దశ.
ఈ ప్రక్రియలో.. సంబంధిత ఉద్యోగానికి తగిన అమెరికా ఉద్యోగి అందుబాటులో లేడని, విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులు లేదా ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ నిరూపించాల్సి ఉంటుంది.
PERM ఆమోదం పొందిన తర్వాతే గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
H-1B వీసాలు రద్దవుతాయా?
లేదు.PERM కార్యక్రమం నుంచి కంపెనీని సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సంస్థలో ఇప్పటికే H-1Bపై పనిచేస్తున్న ఉద్యోగుల వీసాలు ఆటోమేటిక్‌గా రద్దు కావు. H-1B, PERM రెండూ వేర్వేరు ప్రక్రియలు.
అయితే గ్రీన్‌కార్డ్ కోసం PERM దశను ఇంకా పూర్తి చేయని ఉద్యోగులకు మాత్రం తాజా నిర్ణయం సమస్యగా మారనుంది. కొత్త దరఖాస్తులు నిలిచిపోవడంతో వారి శాశ్వత నివాస ప్రక్రియ ముందుకు వెళ్లడంలో జాప్యం ఏర్పడుతుంది.
భారతీయ ఉద్యోగులపై ప్రభావం
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్ నిపుణుల్లో చాలామంది H-1B నుంచి ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ వైపు వెళ్లే మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో PERM కీలక దశ కావడంతో తాజా సస్పెన్షన్ ఇన్ఫోసిస్, TCS, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న కొంతమంది విదేశీ ఉద్యోగుల శాశ్వత నివాస ప్రణాళికలను ఆలస్యం చేయవచ్చు.
అయితే ఇప్పటికే గ్రీన్‌కార్డ్ పొందిన ఉద్యోగుల హోదాపై ఈ ఆదేశం ప్రభావం చూపుతుందని అమెరికా ప్రభుత్వం చెప్పలేదు. అలాగే ప్రస్తుత H-1B వీసాల రద్దుకు ఇది ఆదేశం కాదు.
అమెరికా ప్రభుత్వ ఆరోపణలు
H-1B, PERM కార్యక్రమాలను కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులకు బదులుగా తక్కువ ఖర్చుతో విదేశీ నిపుణులను నియమిస్తున్నారా? అనే అంశంపై దర్యాప్తులు, పరిశీలనలు పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, తాజా చర్యపై ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు వెంటనే స్పందించలేదు. TCS స్పందించేందుకు నిరాకరించినట్లు రాయిటర్స్ తెలిపింది.
గ్రీన్‌కార్డ్ ఆశలకు బ్రేక్?
కొత్త PERM దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో సస్పెండ్ చేసిన సంస్థల్లో గ్రీన్‌కార్డ్ ప్రక్రియ ప్రారంభించాల్సిన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అమెరికా ప్రభుత్వం ఈ సస్పెన్షన్లను ఎంతకాలం కొనసాగిస్తుంది? సంస్థలపై జరుగుతున్న దర్యాప్తుల ఫలితం ఏమిటి? PERM దరఖాస్తుల ప్రాసెసింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.




