టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల బంధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు విజయ్ తనదైన శైలిలో స్పందించారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను అతిగా విశ్లేషించే వారిని వ్యంగ్యంగా విమర్శించే ఓ వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేశారు. దీనికి ‘నీడ్స్ సబ్టైటిల్స్.. రీజినల్ లాంగ్వేజెస్లో’ (Needs Subtitles. Regional Languages lo) అంటూ క్యాప్షన్ జోడించారు.
కాఫీ విత్ కరణ్ షోతో మొదలైన చర్చ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల ‘కాఫీ విత్ కరణ్ 9’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్రేమకథ, పెళ్లి తదితర వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. షోలో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
ముఖ్యంగా రష్మిక తనను పెళ్లి చేసుకోవాలని అడిగిన విషయాన్ని విజయ్ వివరించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో కొందరు ఆయన వ్యాఖ్యలను విమర్శించగా, మరికొందరు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను విశ్లేషిస్తూ పోస్టులు పెట్టారు.
ప్రతి చిన్న విషయాన్నీ విశ్లేషించిన నెటిజన్లు
షోలో విజయ్ సోఫాలో ఎక్కడ కూర్చున్నారు? ఆయన పక్కన కాఫీ కప్పు ఎందుకు ఉంది? రష్మికతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలపై కూడా కొందరు సోషల్ మీడియా వినియోగదారులు చర్చించారు. అంతేకాకుండా, విజయ్ ఇన్స్టాగ్రామ్లో రష్మికను ఫాలో కాకపోవడాన్ని కూడా కొందరు ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ‘ఇన్స్టా సైకాలజిస్టులు’ అంటూ సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను విశ్లేషించే వారిని ఎద్దేవా చేసే ఓ వ్యంగ్య వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోను విజయ్ రీపోస్ట్ చేయడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.
వీడియోలో ఏముంది?
‘Those Insta Psychologists Analysing the Show!’ అనే శీర్షికతో ఉన్న ఈ వీడియోలో సెలబ్రిటీల ప్రతి చిన్న చర్యకు అర్థాలు వెతికే ధోరణిని హాస్యాత్మకంగా చూపించారు. సాధారణంగా జరిగే విషయాలను కూడా ప్రతికూలంగా అర్థం చేసుకుంటూ, వాటి ఆధారంగా వ్యక్తిత్వంపై తీర్పులు ఇచ్చే వారిని వీడియోలో వ్యంగ్యంగా చూపించారు.
ఈ వీడియోను రీపోస్ట్ చేసిన విజయ్, నవ్వుతున్న ఎమోజీలతో పాటు ‘నీడ్స్ సబ్టైటిల్స్.. రీజినల్ లాంగ్వేజెస్లో’ అని రాశారు. అయితే, ఈ క్యాప్షర్తో ఆయన ఎవరిని ఉద్దేశించారో ప్రత్యేకంగా వివరించలేదు. అలాగే, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి విమర్శకు విడివిడిగా సమాధానం ఇవ్వలేదు.
మరోసారి వార్తల్లో విజయ్, రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యక్తిగత జీవితం, సినిమాలకు సంబంధించిన విషయాలు అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అయితే, ఈసారి వారి టాక్ షో సంభాషణలు, బాడీ లాంగ్వేజ్పై జరిగిన చర్చ కొత్త వివాదానికి దారితీశాయి.
తాజాగా విజయ్ షేర్ చేసిన వీడియోతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో జరిగే అతివిశ్లేషణ మరోసారి చర్చలోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అభిమానులు, నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


