T20WC: హెల్మెట్‌లో దూరిన బంతి.. బంగ్లాదేశ్ నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సూపర్-8కు చేరడానికి అవకాశాలు మెరుగుపర్చుకుంది
బంగ్లాదేశ్ విజయం
టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కింగ్స్‌టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో నెగ్గింది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 159 పరుగులు చేసింది. షకిబ్ అల్ హసన్ అజేయ అర్ధశతకంతో (64 నాటౌట్, 46 బంతుల్లో, 9 ఫోర్లు) సత్తాచాటాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్, వాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
నెదర్లాండ్స్ ఛేదన
అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. సిబ్రాండ్ (33; 22 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లకు చేరుకుంది. +0.478 నెట్ రన్ రేటుతో రెండో స్థానంలో నిలిచింది. సూపర్-8కు అధికారికంగా అర్హత సాధించనప్పటికీ, అవకాశాలను మెరుగుపర్చుకుంది.
సూపర్-8 రేసులో పోటీ
గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే తదుపరి దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన స్థానం కోసం బంగ్లాదేశ్‌తో పాటు నెదర్లాండ్స్, నేపాల్ కూడా పోటీలోనే ఉన్నాయి. శ్రీలంక టోర్నీ నుంచి ఔటైన విషయం తెలిసిందే. ఆదివారం నేపాల్‌తో జరిగే పోరులో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఒక వేళ ఓటమిపాలైతే నెదర్లాండ్, నేపాల్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఆసక్తికర సంఘటన
బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హాస్యాస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ వివియన్ వేసిన బౌన్సర్ తన్జీద్ హసన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. అదృష్టవశాత్తు అతనికి ఏ గాయం అవ్వలేదు. కానీ బంతి మాత్రం తన్జీద్ హెల్మెట్‌లో ఇరుక్కుంది. చేతితో బంతిని తీద్దామనుకుంటే ప్రత్యర్థి జట్టు ఎక్కడ ఔట్ అని అపీల్ చేస్తుందో అని భయపడి తన్జీద్ హెల్మెట్‌ను తీసి నేలకు కొట్టాడు. అయినప్పటికీ బంతి బయటకు రాలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Video